విదేశాల్లో ఉద్యోగాల సంగతి

ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటే విదేశాల్లో మంచి ఉద్యోగాలు పొందవచ్చు, ఇంగ్లీషులో మంచి నైపుణ్యం వుంటే అంతర్జాతీయంగా బాగా రాణించవచ్చు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అవకాశాలు మంచిగా ఉంటాయి, బాగా డబ్బు సంపాదించవచ్చు, విలాసవంతమైన జీవితం గడపవచ్చు కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం విలాసాల మాయలో పడి, చదువు యొక్క అసలు లక్ష్యం మర్చిపోతున్నాము. మనం చదువుకునేది ఉన్నతమైన జీవితం గడపటానికి. అంతే కానీ విలాసాల మోజులో పడి జీవితాన్ని దుంఖమయం చేసుకోవటానికి కాదు.

కనుక ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న “అందరి పిల్లలు ఇంగ్లీషు చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే, పేదవాళ్ల పిల్లలు మాత్రం తెలుగులో చదువుకుని ఊళ్ళో ఉండి మట్టిపని చేయాలా?” కాదు. “ధనవంతుల పిల్లలు కన్నవారిని గాలికొదిలేసి, అయినవారందరికి దూరంగా విదేశాల్లో ఉద్యోగాలు వెలగబెడుతుంటే, పేద వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులకు బాసటగా ఉంటూ అయినవారి మధ్య హాయిగా జీవించటం మంచిదా కాదా?” అని మనం ప్రశ్నించుకోవాలి.

ఉన్నతమైన జీవితం అంటే విదేశాల్లో, నగరాల్లో మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు వెలగపెడుతుంటే, మన అమ్మానాన్నలు దిక్కులేనివారిలా బిక్కు బిక్కు మంటూ ఒంటరిగా జీవించటం కాదు. జీవితంలో విజయం సాధించటం అంటే మన పిల్లలు చదువుల్లో మునిగితే, మనం సంపాదనలో మునిగిపోవటం కాదు, పని మనుషుల దయాదాక్షిణ్యాల మీద, మర మనుషుల సహాయంతో, చేదు మందులు మింగుతూ బతుకు లాగటం కాదు. మన అమ్మానాన్నలకు అవసాన దశలో మనం అండగా ఉంటున్నామా, మన పిల్లలతో కలిసి మనం రోజూ సరదాగా ఆడుకున్నామా, వాళ్ళ కేరింతల్ని ఆస్వాదించామా? అవసాన దశలో అయిన వారి మధ్య ఆనందంగా జీవిస్తున్నామా?…ఇవీ విజయవంతమైన జీవితానికి ప్రమాణాలు.

తరువాత మన ఇంట్లో ఎన్ని అధునాతన పరికరాలు, సీసీటీవీలు ఉన్నాయనేది ముఖ్యం కాదు, మన చుట్టూ ఎంతమంది మనల్ని ప్రేమించే వారు, మనకోసం సమయం వెచ్చించగలిగిన వారు ఉన్నారు? మనకు కష్టం వచ్చినపుడు, సమస్య వచ్చినపుడు చేదోడు వాదోడుగా ఉండి ఆదుకునే ఇరుగు పొరుగు ఉన్నారా? లేదా క్షణం తీరిక లేకుండా ఉరుకులు పరుగులు పెట్టేవారు, ఎవరో కూడా తెలియని ఇరుగు పొరుగు ఉన్నారా?

ఇంకా, కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేస్తున్నారా, కలిసి ఒక ఇంట్లో అన్యోన్యంగా ఉండగలుగుతున్నారా లేదా తలో దిక్కుకి విసిరివేయబడి ఒంటరిగా జీవిస్తున్నారా? భార్య భర్తలు కలిసి జీవిస్తున్నారా లేదా కేవలం వారాంతపు సంసారాలు చేస్తున్నారా? దంపతులు సహజంగా పిల్లల్ని కనగలుగుతున్నారా, లేదా పిల్లల కోసం IVF  కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారా?

ఇవీ మనం అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు. అభివృద్ధికి కొలమానాలు డబ్బు, విలాసాలు, సూటు బూటు కాదు, అద్దాల మేడలు కాదు, పది వరుసల రహదారులు కాదు, ఏసీ కార్లు, విమానాలు, రాకెట్లు కాదు, అయినవాళ్లందరిని దూరం చేసుకుని, చేదు మందులు మింగుతూ, మరమనుషుల సహాయంతో ఒంటరిగా వందేళ్లు బతకటం కాదు. మనకివన్నీ తెలియనివి కావు, కానీ మనం చెడు వైపు పరుగులు పెడతాం, ఆకర్షితులవుతాం, అదే కలి మాయ. కలి మాయని ఎదుర్కొని మంచి మార్గంలో నడవాలంటే, మనకు నిజమైన జ్ఞానాన్ని అందించే నిజమైన విద్య కావాలి. అంతేకాని మరింత మాయవైపు నెట్టే చదువులు కాదు. మన ప్రభువులు, మేధావులు ముందు మేల్కొనాలి.

నా దేశానికి, నా ఊరికి కావాల్సింది చదువుకుని, పరాయి దేశంలో ఊడిగం చేస్తూ ఇక్కడికి డబ్బు మూటలు పంపించే మేధావులు కాదు. డబ్బులు పంపించి తల్లి దండ్రుల ఋణం, మాతృభూమి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేము. నా దేశానికి కావాల్సింది ఇక్కడే ఉండి కన్నవారికి అండగా ఉంటూ, జన్మభూమికి సేవ చేసుకుంటూ, తోటి ప్రజలకు ఆదర్శంగా ఉంటూ, సమాజాన్ని సన్మార్గంలో నడిపించగల విద్యావంతులు. ప్రతి దానికి పరాయి వాళ్ళని అనుకరించి, తోటి వాళ్ళని కూడా అదే మార్గంలోకి లాగే మిధ్యా మేధావులు కాదు. స్వంతంగా ఆలోచించగల, ఇక్కడే ఉండి నూతన ఆవిష్కరణలు చేయగల సృజనశీలురు కావాలి.

నేను కట్టే పన్నులతో అటువంటి వారిని తయారు చేయండి, వాళ్ళ కోసం ప్రభుత్వ ధనం ఉపయోగించండి, అంతే కానీ నా డబ్బులతో పరాయి సంస్కృతిని తలకెక్కించుకుని పరాయి దేశానికి ఊడిగం చేయటానికి పరుగులు పెట్టే వలస మనుషుల్ని తయారు చేయవద్దు.

అమెరికా లాంటి దేశాలకు వలస వెళ్లేవారు, స్వదేశంలో అవకాశాలు లేవని, ఇక్కడ సౌకర్యాలు, గుర్తింపు కరువైందని, తగిన ప్రోత్సాహం లభించడం లేదని సవాలక్ష కారణాలు చెప్పవచ్చు. మనదేశంలో ఉంటూ ప్రతి విషయంలోనూ పరాయి దేశాన్ని అనుకరించాలని చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎప్పటికీ అవకాశాలు, సౌకర్యాలు తక్కువగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. కాపీ చేయటానికి, అనుకరించటానికి అలవాటు పడిన వాళ్లకు స్వదేశంలో అన్నీ వెలితిగానే ఉంటాయి. కానీ స్వంతంగా, వినూత్నంగా, సృజనాత్మకంగా ఆలోచించే వారికి స్వదేశంలో ఉన్నన్ని అవకాశలు, సౌకర్యాలు మరెక్కడా ఉండవని గ్రహిస్తారు.

విదేశాల్లో స్థిరపడిన మిత్రులను, బంధువులను కించపరచాలని కాదు నా ఉద్దేశం, దయచేసి నన్ను క్షమించండి.  మీరందరు నా కంటే ప్రతిభావంతులే అయివుంటారు, ఉన్నతమైన వారే, ఉదారస్వభావం ఉన్నవారే. నేను కూడా విదేశాల్లో ఉండి వచ్చినవాడినే. అందరం కూడా ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని, మనం బాగుపడి మన వారిని, మన దేశాన్ని బాగుపరచాలనే ఉన్నతమైన భావాలతోనే విదేశాలకు వలస వెళ్తాము. కానీ మనం ఏమి ఆశించి విదేశాలకు పరుగులు పెడుతున్నామో అవి మనకు ఎండమావుల్లానే మిగిలిపోతున్నాయని గ్రహించలేక పోతున్నాం. అందరి కంటే ఉన్నతంగా బతకాలనే ఆదుర్దాలో మనం నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మన విద్యావ్యవస్థ, చదువులు మనల్ని అటు నడిపించాయి, ఆలా ప్రేరేపించాయి, అనుకరణ ప్రోత్సహించాయి. మన సమాజం కూడా దాన్ని గొప్పగా చిత్రీకరించింది. ఫలితం మన ప్రతిభే మనల్ని మోసం చేసింది. మన తెలివి తేటలు మనల్నే కాటేశాయి. అనుకరించడంలో సఫలం, జీవించడంలో విఫలం, సమాజపరంగా విజయం, వ్యక్తిగతంగా పరాజయం, స్కూల్ పరీక్షల్లో గెలుపు, జీవిత పరీక్షలో ఓటమి. ఇది ప్రతిభావంతుల ‘విజయగాధ’.

ఆంగ్ల భాష నేర్చుకోవటం తప్పు కాదు, పరాయి భాష పరాయి మనుషులతో కనెక్ట్ అవటానికి, భావాలని పంచుకోవటానికి ఉపకరించటానికే కానీ మన మూలాల్ని తెంచేదిగా, మన పునాదుల్ని కూల్చేదిగా ఉండకూడదు. పరాయి భాష మోజులో పడి మన వేర్లని మనం తెంచుకోకూడదు. మన ఆధారాన్ని కోల్పోతే మనం ఇతరులకు బానిసలుగా, ఇతరుల మీద పరాన్నజీవుల్లా బతకవలసిన దుస్థితి వస్తుంది. మన మూలాల్ని గుర్తెరిగి, కాపాడుకుంటేనే మనం నిలబడగలుగుతాం, ఆనందంగా ఉన్నతంగా జీవించగలుగుతాం.

దయచేసి అర్ధం చేసుకోండి. తెలుగు తల్లి మనకోసం పరితపిస్తుంది. ఆర్తిగా ఎదురుచూస్తుంది. తల్లి ఒడికి చేరదాం, అందరం కలిసి ఆనందంగా జీవిద్దాం.

Post a comment or leave a trackback: Trackback URL.

Comments

  • Srinu  On April 1, 2020 at 12:54 am

    Very nice sir. Well written.

Leave a Reply