మేధావులారా ఆలోచించండి!

తెలుగు ప్రజలకు ఇంగ్లీషు విద్యా హక్కుని ప్రసాదించి, వాళ్లకు తెలుగులో చదువుకునే హక్కుని కాలరాస్తుంది మన ప్రభుత్వం. పది కోట్ల మందికి పైగా మాట్లాడుకునే తెలుగు భాషకు తెలుగు గడ్డపైనే ఇంతటి దుర్గతి పట్టడం నిజంగా చాలా దురదృష్టం. మన ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమం తొలగించి ఇంగ్లీషు మాధ్యమం ప్రవేశ పెట్టే నిర్ణయం నిజంగా తెలుగు జాతికి సమాధి కట్టడమనే అని చెప్పాలి. కుహనా మేధావుల వలన, స్వార్ధ రాజకీయ నాయకుల వలన, రాజకీయ దురభిమానుల వలన ఈనాడు మన తెలుగు జాతి నిర్వీర్వం అవుతుంది. తెలుగు ప్రజలు ఇకనైనా మేలుకోవాలి.

ధనవంతుల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతుంటే పేదవాళ్ల పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా?అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డులా అరిచి గీపెట్టే మన మేధావుల అమాయకత్వానికి నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. చాలామంది ధనవంతుల ఇళ్లలో, బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలో, పిల్లలకు అమ్మలు పాలిచ్చి పెంచే పరిస్థితి లేదు. ధనవంతుల పిల్లలు డబ్బాపాలు తాగుతున్నారని, పేద పిల్లల్ని తల్లి పాలకి దూరం చేసి, వాళ్ళకి కూడా డబ్బాపాలు పట్టడం ఎంతవరకు వివేకం? పేదలకు డబ్బా పాల హక్కుని ప్రసాదించి, డబ్బా పాల కోసం ధనవంతులు కట్టే పన్నుల మీద ఆధారపడేలా చేయటం వలన పేదలను ఉద్దరించినట్లా లేక వాళ్ళని మరింత దిగజార్చినట్లా? మన మేధావులు ఆలోచిస్తే మంచిది.

పేద పిల్లలు ప్రతి విషయంలోను ధనవంతుల పిల్లల్ని అనుకరించడానికి, వాళ్లతో పోటీ పడటానికి ధనవంతుల పిల్లలేమి ఆదర్శవంతమైన జీవితం గడపట్లేదు. ప్రభుత్వ విధానాలు రూపకల్పన చేసేటప్పుడు సమాజ శ్రేయస్సుని, శాస్త్రీయతని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని గుడ్డిగా ధనవంతులు పలనా మార్గంలో ఉన్నారు కాబట్టి, ప్రజలందరినీ అదే దారిలో వెళ్ళమని చెప్పటం అవివేకం, దుర్మార్గం. మాతృభాషలో విద్యాబోధన పిల్లల మానసిక వికాసానికి మంచిది, సృజనాత్మకత, క్రియేటివిటీ మెరుగ్గా ఉంటుంది. దానివలన మనుషుల ఆలోచనలు ‘కాపీ అండ్ పేస్ట్’ లా కాకుండా ఒరిజినల్ గా, అసలు సిసలుగా ఉంటాయి. కనుక పిల్లలకు మాతృభాషలో విద్యాబోధన ఎంతైనా అభిలషణీయం. కనీసం పదవతరగతి వరకైనా తెలుగు మాధ్యమం ఉండాలి.

ఇంగ్లీషు మీడియం ధనవంతుల పిల్లలకేనా, పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా అంటూ ప్రశ్నించే మేధావులు అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీషు మీడియం ధనవంతుల పిల్లలకూ మంచిది కాదు, పేద విద్యార్థులకు అంతకన్నా మంచిది కాదు. ఇంగ్లీషు మీడియం వలన ధనవంతుల పిల్లల కంటే పేద పిల్లలకే ఎక్కువ అనర్ధం. ఉదాహరణకు, నేను ఒక పేద రైతు కుటుంబం నుండి వచ్చాను. చిన్నప్పుడు అసలు బడికి వెళ్లాలంటేనే భయం. నాకే కాదు అది సహజంగా పిల్లలకు చాలా మందికి ఉంటుంది. ఇంగ్లీషుని ఒక సబ్జెక్టుగా చదవటానికే చాలా మంది పిల్లలకు ఒక ఫోబియా. మరి మొత్తం చదువు ఇంగ్లీషులో చదవటం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. బడికి వెళ్లాలంటే భయం. పైగా ఇంగ్లీషులో చదవాలి. ఇంటి దగ్గర ఇంగ్లీషు వాతావరణం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో నేను నిజంగా చదువు కొనసాగించ గలిగేవాడినా?

తెలుగు మీడియం కాబట్టి తట్టుకొని ఎలాగోలా నిలబడగలిగాను, నిదానంగా చదువు మీద ఆసక్తి వచ్చింది, ‘స్పూన్ ఫీడింగ్’ చదువులు కాదు కాబట్టి మానసిక పరిపక్వత వచ్చింది. చదువు మీద ఆసక్తి, మానసిక పరిపక్వత వచ్చిన తరువాత ఇక మీడియం అనేది పెద్ద సమస్య కాదు. టెన్త్ తరవాత ఇంటర్ ఇంగ్లీషు మీడియంలో చదవటం నాకు సమస్యగా అనిపించలేదు. నేను మంచిగా చదువులో నిలబడటానికి ఖచ్చితంగా తెలుగు మీడియం దోహద పడిందని చెప్పాలి. కానీ నా పిల్లలకు ఇంగ్లీషు మీడియం అంత సమస్య కాదు. ఎందుకంటే ఇంట్లో ఎంతో కొంత ఇంగ్లీషు వాతావరణం ఉంటుంది, దానికి తోడు, మంచో చెడో, కొంత ‘స్పూన్ ఫీడింగ్’ ఉంటుంది స్కూల్లోనూ, ఇంట్లోనూ. కనుక మానసిక వికాసం సంగతి దేవుడెరుగు గానీ, చదువులు మాత్రం ఎలా గోలా కంటిన్యూ చేయగలుగుతారు. కానీ పేద పిల్లలకు ఇంట్లో ఇంగ్లీషు వాతావరణం ఉండదు, స్కూల్లో ‘స్పూన్ ఫీడింగ్’ ఉండదు. కనుక వాళ్ళు ఇంగ్లీషు మీడియం వలన ఖచ్చితంగా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఉపాధ్యాయుల ద్వారా మేము కూడా అదనపు శిక్షణ, ‘స్పూన్ ఫీడింగ్’  ఇప్పిస్తామనోచ్చు ప్రభుత్వం వారు. కానీ తెలుగు మీడియంలోనే అంతంత మాత్రం చదువు చెప్పే మన ప్రభుత్వ టీచర్స్, ఇంగ్లీషు మీడియంలో ఇరగ బొడుస్తారనుకోవటం అవివేకం అవుతుంది.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం వలన నూటికి ఒకళ్ళో ఇద్దరో లేదా పది మందో లాభపడితే లాభపడవచ్చు, మానసిక వికాసం లేకపోయినా నాలుగు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడటం ద్వారా మంచిగా కెరీర్లో ముందుకెళ్ళవచ్చు. కానీ వాళ్ళ కోసం పిల్లలందరినీ ఇంగ్లీషు సవతి తల్లికి అప్పజెప్పటం, బలిచేయటం ఎంతవరకు భావ్యం? సవతి తల్లి ఇచ్చే చాకోలెట్స్ కి అలవాటు చేసి, పిల్లలను కన్నతల్లికి దూరం చేయటం ఏరకంగా సమర్ధనీయం?

ప్రభువులకు సమాజాభ్యుదయం మీద నిజంగా చిత్తశుద్ధి, స్పృహ ఉంటే, ఇంగ్లీషు మాధ్యమంలో చదివే కోటీశ్వరుల పిల్లలు కూడా తెలుగు బడుల్లో చదివేలా ప్రోత్సహించాలి. అందుకు అవసరైమైన చర్యలు తీసుకోవచ్చు. అది కోటీశ్వరుల పిల్లలకూ మంచిది, సమాజానికీ మంచిది. అంతేకాని ధనికులు ఆంగ్లమాధ్యమంలో చదువుతున్నారు కాబట్టి అదేదో గొప్పని భావించి, పిల్లల మనోవికాసం గురించి కనీస స్పృహ లేకుండా, పేదలకు కూడా తెలుగు మాధ్యమం అవకాశాన్ని దూరం చేయటం మన ప్రభువుల, మన ‘సంఘసంస్కర్తల’ అవివేకాన్ని చాటుతుంది.

అవును ప్రజలు ఆంగ్లమత్తులో తూగుతున్నారు, అదే గొప్పని భ్రమ పడుతున్నారు. దాని కోసం తహతహ లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తెలుగు అనే వెలుగు వైపు ఎలా నడిపించడం? తెలుగు సమాజాన్ని, సంస్కృతిని ఎలా కాపాడటం? తుప్పు పట్టిన మూస ఆలోచనా ధోరణి నుండి బయటకు వచ్చి నిష్కర్షగా, లోతుగా ఆలోచిద్దాం.

Post a comment or leave a trackback: Trackback URL.

Leave a Reply